గాయత్రి మంత్రం కన్న సర్వోత్తమమైన మంత్రం లేదు. తల్లిని మించిన దైవమూ లేదు.
తత్త్వజ్ఞానులు గాయత్రి మహాశక్తిని గొప్ప దివ్యశక్తిగా కీర్తించారు. దాని అత్యున్నత మహత్వాన్ని తెలియజెప్పారు. ఆధ్యాత్మిక ప్రగతి కొరకు చేయవలసిన పురుషార్థములలో గాయత్రి ఉపాసన అగ్రగామిగా భావించవచ్చు. గాయత్రి ఉపాసన వలన ''ప్రజ్ఞ'' విశుద్ధరూపంతో సంప్రాప్తిస్తుంది. ప్రజ్ఞాశక్తి మనిషిని ఆధ్యాత్మిక దృష్టితో వికసింప చేస్తుంది. అతని జీవన స్థాయిని ఎంతో ఉన్నతికి చేరుస్తుంది. సామాన్య జీవాత్మను మహాత్మ, దేవాత్మ, పరమాత్మ స్థాయికి క్రమక్రమంగా ప్రగతి పథంలోకి నడిపిస్తుంది.సర్వజీవరాశులలో మానవుడే శ్రేష్టుడిగా పరిగణింప బడడానికి కారణమైన విభూతి బుద్ధి. పరమాత్మ మనుషునికి దీనిని వరదానంగా ఇచ్చాడు. బుద్ధియే మనిషికి సర్వస్వం. అతన్ని ఉన్నతపథంలో నడిపించినా, అధోలోకంలో పడవేసినా, బుద్ధియే హేతువు.
బుద్ధికన్నా సద్బుద్ధి మహత్వపూర్ణమైనది. బుద్ధి వక్రించి నట్లయితే, చెడు మార్గంలో పోవడం జరిగి, ఆ వ్యక్తియొక్క పతనం జరగడమే కాకుండా, అతను చేసిన పనులు సమాజాన్ని కూడా పాడుచేస్తాయి. మనిషి సద్బుద్ధి సంపన్నుడైతే అతనికి మంచి జరగడమేకాకుండా, సమాజానికి శ్రేయస్కరమవుతుంది.
గాయత్రీ ఉపాసన యొక్క ప్రభావం బుద్ధిని జాగృతం చేసి సద్బుద్ధిగా మార్చడమే!
గాయత్రీ మంత్రం యొక్క సారం, పరమార్థం దాని తృతీయ చరణంలో నిబిడీకృతమయివుంది. దీనిలో మన అందరి బుద్ధులను శుద్ధం చేసి, సరియైన నడవడికకు ప్రేరణ యివ్వమనే ప్రార్థన ఉన్నది. దీని వలన ఉపాసకులకు మనోబలం, ఆత్మబలం, బుద్ధిబలం వికసించి శోభిల్లుతాయి.
ప్రతి భారతీయుడు గాయత్రి ఉపాసన చేసేందుకు అనువుగా నేమాని సుబ్బారావుగారు ఈ పుస్తకాన్ని రూపొందించినారని విశ్వసిస్తున్నాను. దీని సాధన వలన కలిగే ప్రయోజనం...మన వివేకాన్ని, బుద్ధిని పవిత్రంగా చేసుకోవడం. సర్వశుభాలకు, సమాజ శ్రేయస్సుకు ఇది సన్మార్గం. ఈ గాయత్రి మంత్ర సాధన ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి.
సాధన వలన నరుడు నారాయణుడూ, పురుషుడు పురుషోత్తముడూ కాగలడు.
No comments:
Post a Comment